గంజాయి సాగు చేసిన వ్యక్తికి పదేండ్ల జైలు, రూ.లక్ష ఫైన్

జైనూర్, వెలుగు: గంజాయి సాగు చేస్తున్న కేసులో నిందితుడికి పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్  సెషన్స్  కోర్ట్  ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్  గురువారం తీర్పు ఇచ్చారు. జైనూర్  సీఐ రమేశ్  తెలిపిన వివరాల ప్రకారం..

కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా సిర్పూర్(యు) మండలం పంగిడి గ్రామానికి చెందిన ఆత్రం అమృత్​రావు తన చేనులో గంజాయిని సాగు చేస్తుండగా, పక్కా సమాచారంతో 2021 అక్టోబర్​లో అప్పటి జైనూర్  ఎస్ఐ విష్ణువర్ధన్  తనిఖీ చేశారు. సీఐ హనూక్  ఎన్డీపీస్  చట్టం ప్రకారం కేసు బుక్  చేసి కోర్టులో హాజరు పరిచారు. సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో నిందితుడికి ఈ మేరకు శిక్ష విధిస్తూ  న్యాయమూర్తి తీర్పు 
ఇచ్చారు.